ప్రతిపక్షం, జూలై 24: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవాలని, అర్థరాత్రి విడుదల చేసిన వీడియోతో వారి భావోద్వేగాలను తక్కువ అంచనా వేయొద్దని ప్రధానికి సూచించారు.
సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, “మిస్టర్ మోదీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దయనీయమైన మిడ్నైట్ వీడియోతో వారి తెలివితేటలను అవమానించకండి” అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లను మరోసారి గుర్తుచేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే దేశ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతుండగా, ప్రభుత్వం మాత్రం పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది.

















