ప్రతిపక్షం, సెప్టెంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 22ఏ భూముల అంశంపై రాజకీయ దుమారం రేగింది. గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చెబుతున్నప్పుడు, ఇప్పటివరకు కేసులు నమోదు చేసి ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ చివరకు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మహేశ్వర్‌రెడ్డి.. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి చెబుతున్నారని పేర్కొన్నారు. అలాంటి అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తే సంబంధిత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. 23 లక్షల ఎకరాల భూ మార్పిడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
గతంలో ధరణి, ప్రస్తుతం భూ భారతి వ్యవస్థల ద్వారా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వమే ఆరోపిస్తోందని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. భూ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అటవీ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
భూముల వ్యవహారంలో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, తాము ప్రస్తావిస్తున్న భారీ అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. జ్యుడీషియల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ అంశంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
పార్ట్ వన్ బీలో ఐదు లక్షల ఎకరాలను క్లియర్ చేశామని ప్రభుత్వం చెబుతోందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ భూములను క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా ఏమైనా దరఖాస్తులు, విధివిధానాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అందరికీ స్పష్టంగా వివరిస్తే మిగిలిన భూముల విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఐదు లక్షల ఎకరాల విషయంలో అనుసరించిన విధానం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు 22ఏ నిషేధిత జాబితాలో భూములు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల తరఫున పోరాడుతున్నామని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. 22ఏ విషయంలో ప్రభుత్వం తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు తగిన సమయం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
లక్షలాది మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పాయల్ శంకర్ ఆరోపించారు. బాధిత రైతుల తరఫున తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. 22ఏ భూముల సమస్యపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.





























