ప్రతిపక్షం, జూలై 24: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సీజేపీ (CJP) ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ముగిశాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో పాటు సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ పాల్గొన్న ఈ సమావేశం గంటన్నరపాటు కొనసాగింది.
చర్చల సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సీజేపీ కోరింది. విద్యార్థులపై తీసుకున్న చర్యలను పునఃసమీక్షించి, వారిపై ఎలాంటి వేధింపులు ఉండకూడదని ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి రేపు మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చినట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు. గడువులోగా సానుకూల స్పందన రాకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ, కేంద్రం–సీజేపీ మధ్య జరిగిన ఈ చర్చలు కీలకంగా మారాయి. రేపు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

















