ప్రతిపక్షం, జూలై 24: జాతీయ గేయం ‘వందేమాతరం’కు మరింత చట్టబద్ధ రక్షణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్–1971లో సవరణలు చేయడానికి పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం జాతీయ జెండా, జాతీయ గీతం, ఇతర జాతీయ చిహ్నాలను అవమానించడం శిక్షార్హమైన నేరం. అలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
తాజా సవరణ బిల్లు ద్వారా ‘వందేమాతరం’ను జాతీయ చిహ్నాల జాబితాలో చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో ఈ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, పాడకుండా అడ్డుకోవడం లేదా దాని గౌరవానికి భంగం కలిగించే చర్యలను కూడా చట్టపరంగా నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది.
అదే విధంగా ‘వందేమాతరం’కు ‘జనగణమన’తో సమాన గౌరవ హోదా కల్పించడమే ఈ సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బిల్లుపై పార్లమెంట్‌లో జరిగే చర్చల అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది.

















