ప్రతిపక్షం, జూలై 24: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ ముఖంపై పెల్లెట్ గన్‌తో కాల్పులు జరగడంతో అతను ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల ప్రకారం, సాహిల్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం పార్ట్‌టైమ్‌గా కారు నడుపుతున్నాడు. 2025లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీకి తాను కూడా బాధితుడినని, అదే సంస్థకు మళ్లీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో మరోసారి లీకేజీ జరుగుతుందనే ఆందోళనతో నిరసనల్లో పాల్గొన్నాడని తెలిపారు.
“న్యాయం, పారదర్శకత, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రశ్నలు అడిగినందుకు విద్యార్థులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవాబుదారీతనం కోరిన ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. సాహిల్‌కు కూడా పూర్తి మద్దతు ఇస్తాం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
నీట్, ఇతర నియామక పరీక్షల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. “ఇక చాలు… కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి” అంటూ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.






















