ప్రతిపక్షం, కరీంనగర్: 18 ఏండ్లు పైబడిన వారందరూ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే అంశంపై సమావేశం జరగగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మంచి పాలకులను ఎన్నుకునేలా తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.
క్యూఆర్ కోడ్ తో పోలింగ్ స్టేషన్లు గుర్తించవచ్చని, ఈ మేరకు అధికారులు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల విధానం తెలిసేలా ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేసేలా చూడాలని సూచించారు. ఫ్యూచర్ ఓటర్లైన విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మెప్మా పీడీ రవీందర్, మైనింగ్ ఏడి రామాచారి, కరీంనగర్ ఎంఈఓ మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు.