హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణలో ప్రస్తుతం కొలువు జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి తేదీలు వచ్చాయి. అలాగే మెగా డీఎస్సీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. తాజాగా ఆర్టీసీలో కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ఆర్టీసీలో త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆర్టీసీలో ఉద్యోగుల పీఆర్సీపై కూడా తమ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 2017 ,2021 పీఆర్సీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ఉత్తమంగా పని చేసిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రానికి ఆర్టీసీ సంస్థ పునాది అని పొన్నం అన్నారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆర్టీసీ లాస్ నుంచి లాభాల్లోకి తెవడానికి కష్టపడుతున్నట్లు వివరించారు.
ఆర్టీసీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం, ఎన్నికల కోడ్ కారణంగా ఆర్టీసీ బకాయిల చెల్లింపుపై ప్రభావం చూపాయన్నారు. త్వరలోనే బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు మహాలక్షి పథకం పేరు అవార్డు ఇస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు రూ. 280 కోట్ల బాండ్స్ ప్రకటించారని గుర్తు చేశారు. అవి కూడా రెండు మూడు రోజుల్లో పేమెంట్స్ విడుదలవుతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు. తెలంగాణలో మహిళ ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. బుధవారం ఒక్కరోజే 24లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేశారు.