హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ విచారణను వేగం చేసింది. గత రెండు రోజులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బాయరేజ్లను పరిశీలించిన కమిటీ శనివారంనాడు జలసౌధలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆరా తీస్తోంది. నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు గల కారణాలను ఆరా తీస్తున్నది. ఈ సమావేశానికి 2016 నుంచి ఆనకట్టల బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే బదిలీ అయిన, విశ్రాంత ఇంజనీర్లు కూడా సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో ఎన్‌డీఎస్‌ఏ కమిటీ విడివిడిగా సమావేశం అవుతోంది. ఇన్వెస్టిగేషన్స్, మోడల్ స్టడీస్, డిజైన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్ల నుంచి కమిటీ వివరాలు తీసుకుంటోంది. అవసరమైన సమాచారం, వివరాలను ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సేకరిస్తోంది.