[t4b-ticker]

అథ్లెట్ ఆరోపణలు విని షాక్ అయ్యా.. శ్రీనివాస్ గౌడ్

ప్రతిపక్షం, ఆగస్టు 25, హైదరాబాద్: బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనను వేధించారని అథ్లెట్ ప్రతిభ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రతిభ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేశాయని ఆయన తెలిపారు.

ఈ వ్యవహారంపై ఓ జర్నలిస్ట్ తనను ఫోన్‌లో వివరణ కోరినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అథ్లెట్ చేసిన ఆరోపణలు విని తాను షాక్‌కు గురయ్యానని చెప్పారు. తన పదవీకాలంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేశామని పేర్కొన్నారు.

నిఖత్ జరీన్, ఈషా సింగ్ వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను తాము ఎంతో గౌరవించామని, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా అవకాశాలు కల్పించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు తమ ప్రభుత్వం అనేక విధాలుగా సహకరించిందని అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. రాజకీయంగా తనను నేరుగా ఎదుర్కొనే పరిస్థితి లేకనే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇలాంటి ఆరోపణలను తెరపైకి తీసుకువస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అయితే అథ్లెట్ ప్రతిభ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ఇచ్చిన వివరణతో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. క్రీడా వర్గాల వాదనలు వెలుగులోకి రావడంతో దీనిపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News