ప్రతిపక్షం, ఆగస్టు 24, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి చర్మం మరియు గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ E. నాగ బిక్షం, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తేది:24.08.2026 ఉదయం సమయంలో తాళ్లగొమ్మూరు గ్రామం అనిల్ అనే వ్యక్తీ ఇంటి వద్ద, ఒక చిన్న బ్యాగ్‌తో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు గత సంవత్సరం వేసవి కాలంలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడిపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న చిరుతపులిని రాళ్లు, కర్రలు తో కొట్టి మరియు భాణాలు విసిరి చంపినట్లు తెలిపారు. అనంతరం దాని చర్మం మరియు గోర్లను తొలగించి, చర్మాన్ని ఎండబెట్టి, గోర్లను భద్రపరిచి ఉంచినట్లు వెల్లడించారు.
తరువాత చిరుతపులి చర్మం మరియు గోర్లను విక్రయించి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తుండగా సారపాకకు చెందిన చల్లా అనిల్ కుమార్ అనే వ్యక్తీ భూమిని కౌలుకు తీసుకునే వ్యవసాయం చేయుట కొరకు గమ్మలకోట గ్రామం,చింతూరు మండలం కు చెందిన కుంజా భద్రయ్య వద్దకు రాగా అతనిని సంప్రదించినట్లు తెలిపారు. అనిల్ కుమార్ కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని చెప్పడంతో, కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు మరియు మడవి కన్నయ్య ముగ్గురు కలిసి చిరుతపులి చర్మం మరియు గోర్లను ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని తాళ్లగొమ్మూరులోని అనిల్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు.ఈ క్రమంలో చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మం మరియు (17) గోర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వివరాలను వెల్లడించారు.
పట్టుబడిన ముద్దాయిల వివరాలు
- చల్లా అనిల్ కుమార్ R/o తాళ్లగొమ్మూరు గ్రామం, సారపాక,బూర్గంపహాడ్ మండలం.
- కుంజ భద్రయ్య R/o గమ్మలకోట గ్రామం, చింతూరు మండలం,పోలవరం జిల్లా.
- కుంజా గంగరాజు R/o గమ్మలకోట గ్రామం, చింతూరు మండలం, పోలవరం జిల్లా.
- మడవి కన్నయ్య R/o గమ్మలకోట గ్రామం, చింతూరు మండలం,పోలవరం జిల్లా.
పట్టుబడిన / స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ - చిరుతపులి చర్మం – 01—–ఎండిన స్థితిలో ఉన్నది.
- చిరుతపులి గోర్లు – 17
- చిన్న బ్యాగ్ – 01 (చిరుతపులి చర్మం మరియు గోర్లను తరలించేందుకు ఉపయోగించినది.)
ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్సైలు నాగ బిక్షం, ప్రవీణ్, సుమంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





























