Trending Now

కాంగ్రెస్​ రెండో జాబితాపై ఉత్కంఠ.. తెరపైకి కొత్త పేర్లు

సర్వేల ఆధారంగానే ఎంపిక..

ముమ్మరంగా – కొనసాగుతోన్న ఫ్లాష్​​ సర్వేలు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మరో ఒకటి రెండు రోజుల్లో లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ వెలువడనుందన్న ప్రచారం సాగుతున్న తరుణంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ తరపున భారీ ఎత్తున నేతలు దరఖాస్తులు చేయడం, వారిపై అధిష్టానవర్గం, టీపీసీసీ సర్వేలు నిర్వహించింది. సర్వేల ఆధారంగానే పార్టీ అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పీసీసీ పంపింది. అయితే ప్లాష్​ సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ప్రకటించేందుకు అధిష్టానం ముమ్మరంగా సర్వేలు కొనసాగిస్తుండంతో ఆశవాహుల్లో నరాలు తెగె ఉత్కంఠ నెలకొంది. రేపో, ఎల్లుండో రెండో జాబితా ప్రకటనకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తూనే, నియోజకవర్గ నాయకులతో సంప్రదింపులు జరిపే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రత్యేక దృష్టి సారించింది. తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన నలుగురి పేర్లను ప్రకటించింది.

జషీరాబాద్​నుంచి సురేశ్​ కుమార్ సేట్కర్​, మహబూబ్​నగర్​ నుంచి చల్లా వంశీచంద్​రెడ్డి, నల్గొండ నుంచి కుందురు రఘువీర్​రెడ్డి, మహబూబాబాద్​(ఎస్టీ) పొరికే బలరాం పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే!. మిగిలిన 13 నియోజకవర్గాల అభ్యర్థులపై ఎడతెగని చర్చలు సాగిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్ కనుగొలు బృందం, ఆ 13 స్థానాలకు సంబంధించిన నాయకులపై ఫ్లాష్‌ సర్వేలు నిర్వహిస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో సర్వే నివేదికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పోటీ అధికంగా ఉన్న నియోజకవర్గాల నాయకులు, కొత్తగా పార్టీలో చేరి టికెట్లు ఆశిస్తున్న వారితో, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జీ దీపాదాస్‌ మున్షీ సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఎంపికపై, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డినారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, గద్వాల జడ్పీఛైర్​పర్సన్ సరిత సహా పలువురు నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

సికింద్రాబాద్ నుంచి తెరపైకి కొత్త పేర్లు..

సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబానికి ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించగా, పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా విద్యా స్రవంతి, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. భువనగిరి నుంచి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డితో పాటు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వుడ్‌ స్థానమైన వరంగల్ స్థానం నుంచి దొమ్మాట సాంబయ్యను ప్రతిపాదించగా, స్టేషన్‌ ఫన్‌పూర్‌కు చెందిన ఇందిర టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అద్దంకి దయాకర్‌ను అక్కడి నుంచి బరిలో దించడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశమివ్వాలని రాష్ట్ర నాయకత్వం భావించగా, స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎవరికీ టికెట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించినందున జీవన్‌రెడ్డి టికెట్ కేటాయింపుపై ప్రతిష్ఠంభన నెలకొంది. టికెట్‌ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, ఆరెంజ్‌ ట్రావెల్స్‌ యజమాని సునీల్‌ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు వంశీకృష్ణను బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుండగా, పలువురు తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో స్థానిక నాయకులతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. మల్కాజ్‌గిరి నుంచి హరివర్ధన్‌రెడ్డి ఆశిస్తుండగా, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి టికెట్‌ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ ఇద్దరి కంటే బలమైన వారు ముందుకొస్తే బరిలో దింపాలని భావిస్తోంది.

ఖమ్మం గుమ్మంలో రాజకీయ కాక..

ఖమ్మం స్థానం కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, సీనియర్​ నేత వి.హన్మంతరావు పోటీపడుతున్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నందున రాజేంద్రప్రసాద్ పేరును పరిశీలిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌ రెడ్డి, రాజేంద్రరావు టికెట్‌ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్‌ నుంచి నీలం మధు, చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్‌ రెడ్డికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి మస్కతి డైరీ యజమానికి టెకెట్​ ఖాయమైనట్లు సమాచారం.

ఆ మూడు స్థానాల కోసం టఫ్ ఫైట్.. అయోమయంలో కాంగ్రెస్ హైకమాండ్..

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మూడు సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రులు సహా కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మినీ వార్ నడుస్తోంది. తమకు నచ్చిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పించేందుకు అగ్రనేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఖమ్మం టికెట్ కోసం తీవ్ర లాబీయింగ్ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నందిని, ప్రసాద్ లకు అధిష్టానం ఆమోదం పొందేందుకు విక్రమార్క, శ్రీనివాసరెడ్డిలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమార్క సోదరుడు మల్లు రవి కూడా టికెట్ పై కన్నేయడం గమనార్హం. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రవి టికెట్ ఆశించడంతో తన పదవికి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఖమ్మం అభ్యర్థిని ఖరారు చేయడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ మల్లు రవికి పార్టీ అనుమతి లభిస్తే ఖమ్మం టికెట్ కోసం నందినిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని సమాచారం. మూడు రిజర్వ్డ్ సెగ్మెంట్లలో టిక్కెట్ల కేటాయింపులో కూడా కుల సమీకరణం ఉంది.

నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి రిజర్వ్డ్ స్థానాలు. నాగర్ కర్నూల్ టికెట్ మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి కేటాయిస్తే మిగిలిన రెండు సెగ్మెంట్లను మాదిగ సామాజికవర్గ నేతలకు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు నాగర్ కర్నూల్ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఉన్నారు. ఈ టికెట్ ను మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కు పార్టీ కేటాయిస్తే పార్టీ మాల సామాజికవర్గ నేతలకు పెద్దపల్లి లేదా వరంగల్ టికెట్ దక్కే అవకాశం ఉంది.

కరీంనగర్ సెగ్మెంట్ లో వెలమ నేతకు, రెడ్డి నేతకు మధ్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ను బరిలోకి దింపాలని పార్టీ భావించడంతో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆ టికెట్ ఆశించినా ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు సీనియర్ నేత వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్ రావు నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కరీంనగర్ సెగ్మెంట్ లో ఇతర సామాజిక వర్గాల నేతల కంటే వెలమ నేతలదే పైచేయి కావడంతో ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News