ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరిపంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. గవర్నర్ తమ పేర్లను తిరస్కరించిన విషయం తెలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఇంతలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటలో ఆమిర్ అలీఖాన్, కోదండరాంల పేర్లను ఖరారుచేస్తూ గెజిట్‌ను విడుదల చేసిందని గుర్తుచేశారు. తమ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, మంత్రిమండలి తీర్మానాన్ని తిరస్కరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని అభిప్రాయపడిందని తెలిపారు. కొదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దుచేసిందని తెలిపారు. తల్లిలాంటి గవర్నర్ గారు.. రాజ్యాంగాన్ని, మాలాంటి పేదవారిని కాపాడాలి. మాకు న్యాయం చేయాలి. కౌన్సిల్ కి వెళ్ళడానికి అన్ని అర్హతలు వున్నాయి. కోర్టు వారు అన్ని విషయాలు పరిశీలించి తర్వాత ఇచ్చిన తీర్పుని గవర్నర్ గారు అమలు చేసి.. మాకు న్యాయం చేసి మా వర్గాలకు ప్రతినిధిగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి’ అని దాసోజు విజ్ఞప్తిచేశారు.