[t4b-ticker]

రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 07, హైదరాబాద్: రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆరు దశాబ్దాల పాటు నిరంతరం పోరాడిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు రైతాంగ సమస్యలను తన జీవిత లక్ష్యంగా చేసుకుని పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్యమంత్రి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై కలిగిన లోతైన అవగాహనను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భూమిలోని సారం నుంచి మొదలుకొని సాగుకు అవసరమైన నీరు, విత్తనాలు, పెట్టుబడి, పంటల ఉత్పత్తి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వరకు వ్యవసాయ రంగంలోని ప్రతి అంశాన్ని ఆయన లోతుగా అధ్యయనం చేశారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం గుర్తించడం మాత్రమే కాకుండా.. వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేసిన నాయకుడిగా మల్లారెడ్డిని అభివర్ణించారు. వ్యవసాయ రంగంపై ఆయనకు ఉన్న పరిజ్ఞానం కారణంగా ఆయనను ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా’గా పేర్కొన్నారు.

సమాజంలో చాలామంది తమకు హోదా, గుర్తింపు రావాలని కోరుకుంటారని, అయితే సారంపల్లి మల్లారెడ్డి మాత్రం తన శ్రమ, తన పోరాటం రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అలాంటి రైతు నాయకుడిని కోల్పోవడం రైతాంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

సమస్యలపై లోతైన అవగాహన ఉంటే వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి రాసిన పుస్తకాలు, రైతాంగం తరఫున ఆయన లేవనెత్తిన అంశాలను పరిశీలించి వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వామపక్షాలు, రైతు సంఘాలు గతంలో చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు, పథకాలను తీసుకొచ్చాయని ఆయన పేర్కొన్నారు.

భూమిలేని నిరుపేద రైతు కూలీలకు కనీస వేతనం కల్పించాలన్న డిమాండ్‌తో వామపక్ష నాయకులు, రైతు కూలీ సంఘాలు ఉద్యమాలు నిర్వహించాయని సీఎం గుర్తుచేశారు. ఆ పోరాటాల నేపథ్యంలోనే కనీస వేతన చట్టం వంటి చర్యలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. అలాగే ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో సాగిన ఉద్యమాల ఫలితంగా భూసంస్కరణలు, భూ పరిమితి చట్టాలు వచ్చాయని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పోడు, మిగులు భూములను పంపిణీ చేసే చర్యలు చేపట్టామని వివరించారు. ఈ క్రమంలో 24.56 లక్షల ఎకరాలకు పట్టాలు అందించినట్లు చెప్పారు.

నిరుపేదలకు సొంత ఇల్లు ఉండాలన్న డిమాండ్‌ను కూడా వామపక్షాలు బలంగా ముందుకు తీసుకెళ్లాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఆలోచనల నేపథ్యంలోనే దేశంలో పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. రైతులు పండించిన పంటలకు మాత్రం తగిన ధర లభించకపోవడం దురదృష్టకరమని అన్నారు. భూమిపై తయారయ్యే అనేక వస్తువులకు వాటిని తయారు చేసేవారే ధర నిర్ణయిస్తుండగా.. రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కోసం వామపక్షాలు, రైతు సంఘాలు చేపట్టిన ఉద్యమాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు స్వామినాథన్ కమిషన్ వంటి చర్యలు తీసుకున్నామని, కనీస మద్దతు ధర అంశం ప్రాధాన్యం పొందిందని తెలిపారు. నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలోనూ వామపక్షాల పోరాటాల ప్రభావం ఉందని అన్నారు. కరవు, ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ఆహార భద్రత వంటి చర్యలు చేపట్టిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

ప్రజా సమస్యలపై వామపక్షాలు పోరాటాలు చేస్తూ పరిష్కార మార్గాలను సూచించిన సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని పరిగణనలోకి తీసుకుని అనేక నిర్ణయాలు తీసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను రాజకీయ కోణంలో మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపెట్టి చూడాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఇటీవల గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన ప్రజల పేర్లను వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళనలను కూడా సీఎం ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఎలాంటి కారణాలతోనూ అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రజెండా పోరాటాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం, ప్రజా సమస్యలపై సాగిన ఉద్యమాల చరిత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

సభలో నేతలు ప్రస్తావించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. సారంపల్లి మల్లారెడ్డి సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం తరఫున ఒక మంచి కార్యక్రమం చేపట్టే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తామని తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన విధంగానే.. రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్థాయిగా నిలిచేలా తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సంస్మరణ సభలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఎం నాయకులు ప్రకాశ్ కారత్, జాన్ వెస్లీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. సారంపల్లి మల్లారెడ్డి రైతాంగం కోసం చేసిన పోరాటాలను వక్తలు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News