[t4b-ticker]

నేరస్తులు ఎంతటివారైనా వదిలేది లేదు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం: అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 07: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలు–చిన్నారుల భద్రత వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.

పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించే సంస్థగా పనిచేయాలే తప్ప.. ప్రత్యేక అధికార కేంద్రంగా మారకూడదని సీఎం విజయ్ పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజలకు భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. మంచి వ్యక్తులకు పోలీసులు స్నేహితులుగా, నేరాలకు పాల్పడేవారికి కఠినంగా వ్యవహరించే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖకు స్వతంత్రత ఉన్నప్పటికీ అది ప్రజల ప్రయోజనాలకే ఉపయోగపడాలని పేర్కొన్నారు.

‘చట్టం ముందు అందరూ సమానమే’ అనే విధానంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని విజయ్ తెలిపారు. నేరానికి పాల్పడిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా, ఏ స్థాయిలో ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ అనుబంధాలు, పలుకుబడితో నేరాలకు పాల్పడిన వారికి మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేలా పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

రాష్ట్రంలో గత మూడు నెలల్లో నమోదైన నేరాలపై కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన అన్ని నేరాలను ఒకే కారణంతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. కొన్ని ఘటనల వెనుక పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు, ప్రతీకార చర్యలు వంటి కారణాలు ఉన్నాయని వివరించారు. నేరం జరిగిన ప్రతిసారీ మొత్తం బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పడం కంటే.. ఆ ఘటనకు దారితీసిన కారణాలను గుర్తించి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు.

డ్రగ్స్ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విజయ్ వెల్లడించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజంపై ఉందన్నారు. కోయంబత్తూరులో జరిగిన కళాశాల విద్యార్థి హత్య కేసును ప్రస్తావిస్తూ.. ఈ కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో తెలిపారు. యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులయ్యేందుకు స్నేహితుల ఒత్తిడి, సామాజిక పరిస్థితులు తదితర కారణాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిఘాను మరింత పెంచుతున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చెన్నైలో మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద గత మూడు నెలల్లో 330 కేసులు నమోదు చేసి, 556 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్‌పై కేవలం పోలీసు చర్యలతోనే సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, యువతలో అవగాహన పెంచేందుకు కూడా విస్తృత కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

అవినీతిపై తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని విజయ్ స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరాలు, అక్రమాలు, ప్రజల భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వం కఠిన వైఖరితో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. మహిళలపై నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే.. అవి చోటుచేసుకోకుండా ముందుగానే నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ‘సింగపెన్ స్పెషల్ ఫోర్స్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలు, చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

మొత్తంగా తమిళనాడులో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, అవినీతి నిరోధం, మహిళలు–చిన్నారుల రక్షణ అంశాల్లో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసు వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News