ప్రతిపక్షం, సెప్టెంబర్ 07: హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రధాన గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో సభలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి తమను అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తన టీషర్ట్‌ను తీసేసి సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ పట్టుకుని నెట్టేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. మరోవైపు తోపులాటలో తన చీర లాగారని ఎమ్మెల్సీ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘర్షణలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా గాయాలైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ముఖం, చేతికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. జగదీశ్‌రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
చివరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే చోటుచేసుకున్న ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్‌ఎస్ నేతలు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తుండగా, అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా నిబంధనల అమలులో భాగంగానే పోలీసులు అడ్డుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.





























