ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 07: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా సబ్బండ వర్గాలను మోసం చేసిందని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రజా సమస్యలపై నిలదీసేందుకు అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలు ధరించి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో గులాబీ శ్రేణులు కదం తొక్కాయి.కరీంనగర్ బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వెయ్యి రోజుల పాలనలో సర్వనాశనమైన వ్యవస్థలు
ఈ సందర్భంగా నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, పేదలకు ఆసరా పెన్షన్లు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. రైతన్నలకు రైతుబంధు, రైతు బీమా కరవయ్యాయని, జీవిత కాలం సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే నల్ల చొక్కాలతో వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని పాలనకు పరాకాష్ట అని విమర్శించారు.
తక్షణమే ఎమ్మెల్యేలను విడుదల చేయాలని డిమాండ్
అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, వారిని అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై గళం విప్పితే అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్ను అనిల్ కుమార్ , బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాస్తారోకలో పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు.





























