తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 7: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో తమ వాణిని వినిపించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో, ధర్నా కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాగుల సారయ్య, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేశ్ గౌడ్, సనాదుల బాల పోచయ్య, చౌడు చర్ల జయపాల్ రెడ్డి, పూల మహేందర్ గౌడ్, రేకులపల్లి సంతోష్ రెడ్డి, బద్దిపడగ కిష్టారెడ్డి, చింతల రాంరెడ్డి, బెదురు తిరుపతి, తిప్పని నాగేంద్రం, బొల్లు తిరుపతి, చింతల కిష్టయ్య, రచ్చ సిద్దు, మ్యాటర్ కనకయ్య, దేవులపల్లి కనకయ్య, అనగోని పరశురాములు గౌడ్, పులగూర్ల కనకారెడ్డి, ఎడ్ల నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






























