[t4b-ticker]

మోదీ సభకు గంటలోనే హౌస్‌ఫుల్.. 42 వేల మందికి వెయిటింగ్ లిస్ట్.. తొలిసారి డిజిటల్ ఎంట్రీ!

ప్రతిపక్షం, సెప్టెంబర్ 07: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనకు భారీ స్పందన లభిస్తోంది. సెప్టెంబర్ 8న వడోదరలో ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈసారి కార్యక్రమానికి ప్రవేశం కోసం తొలిసారిగా బుక్‌మైషో ద్వారా ఉచిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే అందుబాటులో ఉన్న సీట్లన్నీ పూర్తిగా బుక్ అయ్యాయి. ఆ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించడంతో 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో చేరినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో ప్రవేశ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. బుక్‌మైషోలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వారి ఖాతాలో డిజిటల్ టికెట్ అందుతుంది. అందులో ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. కార్యక్రమ వేదిక వద్ద ఈ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్ నుంచి ధ్రువీకరణ, ప్రవేశం, సీటింగ్ వరకు మొత్తం ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించనున్నారు. భారీగా ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో క్యూలు, రద్దీని నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

వడోదరలోని మహారాజా సయాజీరావ్ విశ్వవిద్యాలయం పావిలియన్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. బుక్‌మైషోలో కార్యక్రమ సమయాన్ని ఉదయం 10.30 గంటలుగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుజరాత్‌కు సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

మోదీ పర్యటనలో భాగంగా గుజరాత్‌లో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే, సరుకు రవాణా మార్గాలు, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని కీలక విభాగాలను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 326 మార్గ కిలోమీటర్ల పొడవైన మూడు విభాగాల అభివృద్ధికి రూ.20,700 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు సమాచారం. ఈ మార్గాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో దేశంలోని సరుకు రవాణా వ్యవస్థకు మరింత వేగం వచ్చే అవకాశం ఉంది.

అదేవిధంగా సుమారు 329 కిలోమీటర్ల మేర విస్తరించే మూడు రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వీటి కోసం రూ.9,700 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. వడోదర–రత్లాం మధ్య అదనపు రైల్వే లైన్లు, మియాగం కర్జాన్–చోరండా–మల్సార్ మార్గంలో గేజ్ మార్పిడి, విశ్వామిత్రి–దభోయ్ మార్గం డబ్లింగ్ వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది. గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య రైల్వే అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

రహదారుల రంగంలోనూ పలు కీలక పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1,780 కోట్ల విలువైన మూడు జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో భాగంగా రహదారుల విస్తరణ, నదులపై అదనపు వంతెనల నిర్మాణం, కీలక కూడళ్ల వద్ద గ్రేడ్ సెపరేటెడ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటి ద్వారా రహదారి రవాణా మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.

వడోదర కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించి ప్రసంగించనున్నారు. ఒకవైపు వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుండగా.. మరోవైపు ప్రధానమంత్రి సభకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రవేశం కల్పించడం ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే సీట్లు నిండిపోవడం, మరో 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో చేరడం వడోదర కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.

Spread the love

Related News

Latest News