ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హనుమకొండ నగరంలో ఇవాళ పొలిటికల్ హైవోల్టేజ్ హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్‌ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్‌ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
సీనియర్ నేత హరీష్‌రావు ఆదేశాల మేరకు బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్‌నగర్‌లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్‌మీట్‌లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ.. ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడించారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్దిచెప్పే యత్నం చేశారు. ఆ సమయంలో..
ఆరూరి అనుచరులు బీఆర్‌ఎస్ నేతల్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు బలవంతంగా ఆరూరిని బుజ్జగించే యత్నం చేశారు. ‘‘చివరి నిమిషంలో వస్తే ఎలా?’’ అని ఆరూరి ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టకున్నారు. అయితే హరీష్‌రావు సాయంత్రం వచ్చి అన్నీ మాట్లాడతారంటూ ఆరూరితో చెప్పారు వాళ్లు. అలా వాళ్లతో మాట్లాడిన కాసేపటికి అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి కారులో ఆరూరి ఎక్కారు. అయితే ఆ సమయంలోనూ ఆరూరి అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆరూరి నిలువరించడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వరంగల్ ఎంపీ సీటు కండిషన్‌పై బీజేపీలో చేరేందుకు ఆరూరి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
పెంబర్తిలో ఉద్రిక్తత..
జనగాం జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు ఆయన్ని తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు యత్నించారు. అయితే బీఆర్‌ఎస్ నేతలు సైతం ఆరూరిని లాగేయడంతో.. జరిగిన తోపులాటలో ఆరూరి చొక్కా చినిగిపోయింది.