Trending Now

పాత పైప్‌లైన్లకు కొత్త బిల్లులు..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ మానస పుత్రికల్లో ఒకటైన మిషన్​భగీరథ పథకం పనులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టి సారించింది. ఈ పథకంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి విజిలెన్స్​ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే!. అయితే తొలుత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనుల తీరును పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఆ జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనలో లభ్యమయ్యే సమాచారం ఆధారంగా విచారణను రాష్ట్రమంతటికీ విస్తరింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2016లో కృష్ణా, గోదావరి నదుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత నీటిని అందించేందుకు సుమారు రూ.46,000ల కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టి సారించింది.

ముందుగా ప్రశాంత్​రెడ్డి జిల్ళా పైనే దృష్టి..

మిషన్‌ భగీరథకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను విచారణకు ఎంచుకుంది. ఇప్పటికే ఈ పథకం ఇంజినీర్ల నుంచి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పలు రికార్డులను సేకరించింది. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.7,000ల కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గోదావరి నుంచి నిజామాబాద్‌ గ్రామీణ, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి బోధన్‌, జుక్కల్‌, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి తదితర నియాజకవర్గాలకు రక్షితనీరు అందించేందుకు పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సేకరించిన వివరాలు ఆధారంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు రూ.2670 కోట్ల వ్యయంతో 1645 గ్రామాలకు నీరందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. రికార్డుల ప్రకారం 1198 ఓవర్‌హెడ్‌ సర్వీసింగ్‌ రిజర్వాయర్లు(ఓహెచ్‌ఎస్‌ఆర్‌), 5973 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు నిర్మించారు. 5,58,171 గృహాలకు రక్షిత నీటిని సరఫరా చేసినట్లు చెబుతుండటంతో పలు ఇళ్లలోనూ తనిఖీలు చేయాలని విజిలెన్స్ నిర్ణయించింది.

పైపుల ధరలపై ఆరా : మరోవైపు పైప్‌లైన్ల పనుల పరిశీలన కేంద్రంగా విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రామీణ రక్షిత నీటిసరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్‌) పథకాల కింద చేపట్టిన పైప్‌లైన్లనే మిషన్‌ భగీరథ కింద చూపించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలున్నందున వాటిని గురించి అధికారులు క్షుణంగా ఆరా తీయనున్నారు. ఈ పథకానికి వినియోగించిన పైప్‌లు నాటి కీలక ప్రజాప్రతినిధి సన్నిహితుడి కంపెనీకి చెందినవిగా పేర్కొంటున్నారు. a : ఈ నేపథ్యంలో ఆ పైప్‌ల స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)తోపాటు, నాటి మార్కెట్‌ ధరను పోల్చిచూడనున్నారు. పలు ప్రాంతాల్లో నల్లాలు బిగించకున్నా బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలున్నందున క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. అదేవిధంగా జరిగిన పనులనే కొత్తగా చేసినట్లుగా నమోదు చేయడం, సామగ్రి కొనకుండానే కొన్నట్లు దస్త్రాల్లో చూపించడం, కొనుగోలు చేసిన పరికరాలు వినియోగించకుండా పక్కన పడేసి అక్రమంగా బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై పరిశీలన తర్వాత విజిలెన్స్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేయనున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News