- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
- 49,025 మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం
- రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
- కరీంనగర్లో రూ.8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 16: పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఉదయం ఆకలితో తరగతి గదులకు రాకుండా.. వారికి నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి ఆకలిని తరిమి అక్షరానికి అండగా నిలవడమే స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. కరీంనగర్ మార్కెట్‌యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా కలిసి సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారు.
విద్యే.. పిల్లలకు గొప్ప ఆస్తి
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో విద్యార్థుల ఎదుగుదలకు భూములు, నిధులు వంటి ఆస్తులు ఉండేవని, ఇప్పుడు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని అన్నారు. ఇటీవల జరిగిన సిప్ సర్వేలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలను పరిశీలించినప్పుడు ఉన్నత చదువులు చదివిన కుటుంబాలే మెరుగైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నామని, ఇప్పుడు విద్యార్థులకు ఉదయమే నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆకలితో చదువుకు ఆటంకం ఉండొద్దు
ఆకలితో ఉన్న పిల్లవాడు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేడని మంత్రి అన్నారు. విద్యార్థులకు ఉదయమే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఏకాగ్రత, జ్ఞానాత్మక సామర్థ్యం, తరగతి గది భాగస్వామ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల హాజరు, సమయపాలన, విద్యా పనితీరు మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా ఉదయమే ఉపాధి కోసం వెళ్లే తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ఆర్థికంగా, సమయపరంగా ఉపశమనం కల్పిస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు వంట, ఆహార నిర్వహణ బాధ్యతల నుంచి విముక్తి పొంది బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
కరీంనగర్లో 49,025 మందికి అల్పాహారం
కరీంనగర్లో సుమారు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌కు రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. 17 మండలాల్లోని 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ బ్రేక్‌ఫాస్ట్ సేవలు అందుతాయని చెప్పారు. మొత్తం 49,025 మంది విద్యార్థులు ప్రతిరోజూ ప్రయోజనం పొందుతారని వివరించారు. కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల విద్యార్థులకు ఈ కిచెన్ ద్వారా అల్పాహారం అందుతుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా హుస్నాబాద్‌లో 16,544 మంది, మానకొండూర్‌లో 8,645 మంది, చొప్పదండిలో 7,481 మంది, కరీంనగర్లో 16,355 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని చెప్పారు. రాష్ట్రంలో ఇది ఆరవ కమ్యూనిటీ కిచెన్ అని మంత్రి తెలిపారు. ఇక్కడి నుంచి 17 మండలాల్లో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం పంపిణీ జరుగుతుందని చెప్పారు.
అధునాతన యంత్రాలతో ఆహార తయారీ
కిచెన్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, సాంబార్ తయారు చేసే మిషన్లు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పాత్రలు శుభ్రం చేసే మిషన్లు, పాల కేంద్రం, ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్, కూరగాయలు కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు, చట్నీ పౌడర్ తయారీ మిషన్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. వాటి పనితీరును స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యతతో, పరిశుభ్రంగా అల్పాహారం అందించడమే కేంద్రీకృత వంటశాలల ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఆహార భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ISO స్థాయి ప్రమాణాలను పాటించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. థర్మల్ ఇన్సులేటెడ్ వాహనాల ద్వారా పాఠశాలలకు సకాలంలో అల్పాహారం తరలిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇష్టమైన, సాధారణంగా ఇళ్లలో తినే ఆహార పదార్థాలతో మెనూ రూపొందించామని, మెనూ రూపకల్పనలో NIN సహకారం తీసుకున్నామని చెప్పారు.
వారంలో ఆరు రకాల అల్పాహారం
సోమవారం ఇడ్లీ–సాంబార్, మంగళవారం పూరీ–ఆలూ కుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ–సాంబార్, శనివారం బోండా–చట్నీ అందిస్తామని మంత్రి వివరించారు. రోజు విడిచి రోజు విద్యార్థులకు పాలు కూడా అందిస్తామని తెలిపారు.
కోడంగల్‌లో పైలట్ ప్రాజెక్ట్..
2024 డిసెంబర్లో కోడంగల్‌లో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని మంత్రి తెలిపారు. అక్కడ విద్యార్థుల హాజరు 75 శాతం నుంచి 90 శాతానికి పెరిగినట్లు గుర్తించామని చెప్పారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం, సమయపాలన మెరుగుపడినట్లు, ఆలస్యంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. కోడంగల్‌లో అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 17.72 లక్షల మంది విద్యార్థులకు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,72,291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. 23,106 ప్రభుత్వ పాఠశాలలను కార్యక్రమం పరిధిలోకి తీసుకురానున్నామని చెప్పారు.31 జిల్లాల్లో 31 కేంద్రీకృత మెగా/కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని, వీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.245 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. అల్పాహారం పంపిణీకి సుమారు 1,400 వాహనాలు, 5,000 మంది సిబ్బంది అవసరమవుతారని చెప్పారు. కేంద్రీకృత వంటశాలల ద్వారా సుమారు 15,000 ప్రత్యక్ష, 10,000 పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు.
హరే కృష్ణ మూవ్‌మెంట్‌కు ధన్యవాదాలు
స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం CSR నిధుల కింద సంస్థకు సహకరిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచినందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఇదే ఫౌండేషన్ ద్వారా కరీంనగర్లో ఆలయం నిర్మించాలని అనుకున్నామని, ఆ అంశం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని చెప్పారు. మళ్లీ ఫౌండేషన్‌తో కలిసి ఆ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను కూడా హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందని, కళాశాలలకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు.
విద్యార్థులతో కలిసి అల్పాహారం
సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం కిచెన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి వాటి పనితీరు, ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.































