ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ఇంధన పొదుపును ప్రోత్సహించడం ద్వారా దేశానికి మరింత ఇంధన భద్రత కల్పించవచ్చని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యాన్ని మరో విద్యుత్ కేంద్రంగా భావించాలని ఆయన సూచించారు.
బుధవారం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ సదస్సుల కేంద్రంలో జరిగిన ఇంధన సామర్థ్య సదస్సు కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో, అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం కూడా అంతే ముఖ్యమని వివరించారు. అవసరం లేకుండా వినియోగించకుండా పొదుపు చేసిన ప్రతి విద్యుత్ యూనిట్ తక్కువ ఖర్చుతో లభించే విద్యుత్‌తో సమానమని పేర్కొన్నారు.
ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడకూడదని భట్టి విక్రమార్క అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచే వ్యూహాత్మక అంశమని తెలిపారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్పారు.
మెరుగైన సామర్థ్యం కలిగిన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని ఉపముఖ్యమంత్రి సూచించారు. స్మార్ట్ ఇంధన నిర్వహణ విధానాలను అమలు చేసి విద్యుత్ వృథాను గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్‌లో ప్రతి మెగావాట్ తగ్గింపు విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడుతుందని వివరించారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలు, తయారీ రంగం, సమాచార కేంద్రాలు, జీవ విజ్ఞాన రంగం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల విస్తరణతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పీక్ సమయంలో డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
పీక్ డిమాండ్‌ను నియంత్రించగలిగితే విద్యుత్ ఉత్పత్తి, ప్రసార వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు ద్వారా దేశానికి ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఇంధన అవసరాలను తీర్చేందుకు కొత్త వనరులను అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంధనాన్ని వృథా కాకుండా వినియోగించడం కూడా కీలకమని అన్నారు.
భారత్‌లో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు అనేక ప్రయోగాత్మక ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటల్ సాంకేతికతలను సమన్వయం చేసుకుని ఇంధన వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్ వృథా ఎక్కడ జరుగుతోందో గుర్తించి, వినియోగాన్ని మెరుగుపరిచే విధానాలను అభివృద్ధి చేయాలని అన్నారు.
భవిష్యత్తులో పరిశ్రమలు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఇంధన సామర్థ్యాన్ని ఏడాదికి ఒకసారి నిర్వహించే ఆడిట్ కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా మార్చాలని అన్నారు.
ఇంధన సామర్థ్యం పెంపు కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, ఆర్థిక సంస్థలు, విద్యా సంస్థలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క సూచించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, పరిశ్రమల్లో సమర్థవంతమైన పరికరాలను వినియోగించడం వంటి చర్యలు ఇంధన పొదుపుకు దోహదపడతాయని తెలిపారు.
స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు ఇంధన సామర్థ్యం అత్యంత ఆచరణాత్మక మార్గాల్లో ఒకటని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వినియోగంలో పొదుపు, సాంకేతిక సామర్థ్యం, వృథా నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.





























