ప్రతిపక్షం, నిర్మల్ జిల్లా ప్రతినిధి: రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో ఆదిలాబాద్ మాజీ ఎంపీ.. బీజేపీ రాష్ట్ర నేత రాథోడ్ రమేష్ శనివారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో తన అనుచరులతో కలిసి రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. మూడేళ్ళుగా బిజెపిలో చేరి చురుకైన నేతగా సేవలందించిన రాథోడ్ రమేష్ కు బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించగా.. రాథోడ్ రమేష్ ఎన్నికలలో ఘోరంగా అపజయం పాలయ్యారు. అయితే తిరిగి బిజెపి అధిష్టానం నుంచి తనకు ఎంపీ టికెట్ ఆశించిన రాథోడ్ రమేష్ కు ఇటీవల షాక్ తగిలింది. ఆశించిన ఎంపి టికెట్ మాజీ ఎంపీ గోడం నాగేష్ కు బిజెపి అధిష్టానం కేటాయించడంతో అప్పటినుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాష్ట్ర బిజెపి నేత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో ఆయనతో రహస్యంగా సమావేశం నిర్వహించడం చర్చాంశానీయంగా మారింది.
రాథోడ్ రమేష్ తో పాటు ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు, అదిలాబాద్ జడ్పీ చైర్మన్ లతోపాటు పలువురు బిజెపి, బీఆర్ఎస్ నేతలతో మాజీమంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఈనెల 18న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతల చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు నిర్మల్ లో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కాంగ్రెస్ లో చేరేందుకు బిజెపి, బీఆర్ఎస్ లకు చెందిన వేలాదిమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.