ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగుతుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో ప్రజలతో వారు ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రతీరోజూ ఒక బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.