ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్ళాడుతూనే ఉన్నారు. వారి మాటలు విన్న ప్రజలు అవునా.. నిజమా.. ఎట్లా అంటూ ముక్కుమీద వేళ్లేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కాబోతుందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్ కేసీఆర్‌ను మరిపిస్తున్నారని ఎద్దెవా చేశారు.
మూడోసారి మేమే..
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వంద రోజులు గొప్ప పాలన అందిచా.. పీసీసీ చీఫ్‌గా తన సత్తా చూపిస్తానంటున్నారని.. ఇదే మాటకు రేవంత్ కట్టుబడి ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. ఈ సవాల్‌కు రేవంత్ కట్టుబడాలని లక్ష్మణ్ కోరారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుని రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత తీసుకోవాలన్నారు.
వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్..
దేశంలో కాంగ్రెస్ లేదని, రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ఆ పార్టీ కనిపించదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న రేవంత్ ఆరోపణలు అవాస్తవమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, పడిపోతే కాపడబోమని చెప్పారు. తాము గేట్లు తెరిచామంటున్నారని.. జాగ్రత్తగా చూసుకోవాలని.. మీ ఎమ్మెల్యేలు పారిపోయేలా ఉన్నారు కాపాడుకోవాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందన్నారు.