హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: నవ్వుపోదురుగా నాకేంటీ..? అన్న చందంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలు పార్టీలు మారుతున్నారు. నేతలు చూసిన గ్రామాల్లోని కార్యకర్తలు సైతం తామేమి తక్కువ తిన్నామా..? అంటూ వారు పొద్దున ఒకటి, సాయంత్రం ఒక పార్టీ కండువా కప్పుకొంటు తెగ ఏంజాయ్!. చేస్తున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కండువాలు మార్పు సంస్కృతి దాపురించింది. ఎన్నికలు వచ్చాయంటే సరి నాయకులు, కార్యకర్తలు సైతం పార్టీలు మార్పుపైనే దృష్టిపెడుతున్నారు.
గతంలో ఉన్న పార్టీలో పదవులతో పాటు భారీగా సంపాదించుకున్న నేతలు కొంత మంది డబ్బు కోసం, మరికొంత మంది పదవులు, పైరవీల కోసం అధికార పార్టీలో చేరుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్కృతికి పట్నం నుంచి పల్లెలకు సైతం చేరింది. అధికార పార్టీలో ఉంటూ భారీ ఎత్తున సంపాదించిన పార్టీ ముఖ్యనేతలతో పాటు క్రింది స్థాయి నేతలు సైతం తిరిగి అధికార పార్టీలోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. కొంత మంది వద్దన్న కూడా కండువా కప్పుకుంటూ ఫోటోలు దిగుతూ ఫోజులు కొట్టి, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేస్తున్నారు.
టీ తాగినంత ఈజీగా కండువాలు మార్పు..
కండువాలు మార్చేందుకు టీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ఉదయం ఓ పార్టీలో ప్రచారం చేసి మధ్యాహ్నానికి మరో పార్టీలో జెండా పట్టుకొని దర్శనమిస్తున్నారు. ఇదేందీరా బయ్ అంటే డబ్బులు ఇచ్చారు వెళ్లా.. ఓటు మాత్రం ఇక్కడే గుద్దుడు అంటూ సమాధానం ఇస్తుండడంతో పార్టీ నేతలు కంగుతింటున్నారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ రాత్రి ఖండించి, పొద్దునే సీఎం వద్ద కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. గతంలో 2004లో కాంగ్రెస్‌పార్టీ సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే వెంటనే రాత్రికి రాత్రి అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి టీడీపీలో చేరారు. చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. అయితే అప్పుడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలిచి, సీఎంగా వైఎస్ అయ్యారు.
దానం నాగేందర్ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే!. అధికారం ఏ పార్టీలో ఉంటే దానం నాగేందర్ ఆ పార్టీలో ఉంటారంటూ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేళ రాజకీయ వలస పక్షులు సీటు ఖరారు చేసుకొని పార్టీలు మారుతున్నాయి. కాదేది అనర్హం అని కార్పొరేటర్ నుంచి సిట్టింగ్ ఎంపీ దాక పార్టీ ఫిరాయింపు పరిపాటిగా మారింది.
ఎన్నికలను పటిష్టంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ..
రాజకీయ వలస పక్షులను పసిగట్టి పార్లమెంట్ స్థానాల అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అంటే.. బీజేపీ ఆపరేషన్ లోటస్ అంటూ సీట్ల హామీతో ఇతర పార్టీ నేతలకు స్వాగతం పలుకుతున్నాయి. కాంగ్రెస్ కండువా వేసుకునేందుకు టీ తాగీనంత టైం కూడా తీసుకోట్లేదు నేతలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆహ్వానిస్తే రెక్కలు కట్టుకువాలిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటాలని గట్టిపట్టుదలతో ఉన్న రేవంత్ టీమ్.. చేరికలకు లేదు అడ్డు గేట్లు తెరిచాం అంటూ స్వయంగా ప్రకటించారు. అధిష్టానానికి మెజార్టీ సీట్లు సాధించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పొలిటికల్ స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు.
అయిదుగురు వలస నేతలకు కాంగ్రెస్ టికెట్టు..
సర్వేల ఆధారంగా జనబలం, ఆర్థిక బలం ఆధారంగా టికెట్లను కేటాయిస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. జంపింగ్ జపాంగ్‌లకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అయిదుగురికి లోక్‌సభ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఇందులో దానం నాగేందర్, చేవేళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ పసునూరి దయాకర్, పెద్దపల్లి గడ్డం, మల్కాజిగిరి సునీతా మహేందర్‌రెడ్డి ఉన్నారు.
భగ్గుమంటున్న నేతలు..
వలస నేతలకు వరుసగా లోక్‌సభ టికెట్టు కేటాయిస్తుండంపై కాంగ్రెస్‌లోని మిగతా నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా చేవేళ్ల, మల్కాజిగిరి, వరంగల్, సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్లను ఆశించిన కాంగ్రెస్ నేతలు అధిష్టాన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే వీరికి టికెట్లు దక్కేందుకు ప్రయత్నించిన టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌తో పాటు సీనియర్ల సహకారం ఉందంటూ వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చేరికల పట్ల స్థానికల నేతల నుంచి కొంత అసంతృప్తి రావడం సర్వసాధారణమే అని నేతలు కొట్టిపారేస్తున్నారు.
బీజేపీ టికెట్లకు డిమాండ్..
కేంద్రంలో వరుసగా రెండుపర్యాయాలు అధికారంలో ఉంటూ, మూడుపర్యాయం అధికారంలోకి వచ్చేందుకు పోటీపడుతున్న బీజేపీ సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఆర్ఎస్ నుంచి నేతలు క్యూ కట్టారు. అలా పార్టీలో చేరి.. ఇలా టికెట్లను అందుకొని వెళ్తున్నారు. దీంతో బీజేపీలో గత కొన్నేళ్లుగా ఉంటున్న నేతలు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ టికెట్ల ప్రకటనకు ముందు రోజే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కండువా కప్పుకున్న 24 గంటల్లోనే తన కొడుకు భరత్ కు బీజేపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఇటీవలే పార్టీలో చేరి బీజేపీ నుంచి ఎన్నికల రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇలా వచ్చి అలా టికెట్ కొట్టేసుకొని వెళ్లారు. వరంగల్, ఖమ్మం స్థానాల్లో కూడాఇటీవల పార్టీలో చేరిన నేతలకే వస్తుందంటున్నారు. వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి జలగం వెంకట్ రావు కే బీజేపీ టికెట్లు దక్కుతుందని బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి.