ప్రతిపక్షం ప్రతినిధి, నకిరేకల్: గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని నకిరేకల్ ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్ అన్నారు. బుధవారం జరిగిన నకిరేకల్ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. అవసరమైతే బోర్లను అద్దెకు తీసుకొని ప్రజల అవసరాలను తీర్చాలని ఆమె ఆదేశించారు. గత సంవత్సరం వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి గ్రామాల్లో నీటి సమస్య తలెత్తిందని అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చూడాలని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.