ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మార్చి 29: బీఆర్ఎస్ పార్టీ నుండి కొంత మంది దొంగలు బయటకు పోతున్నారని.. కష్టకాలంలో పార్టీకి కృషి చేసేది కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన ఇల్లు. రానే రాదనకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చూపించిండు కేసీఆర్. కేసీఆర్ లేనిది తెలంగాణ ఉద్యమం ఉన్నదా..? కేసీఆర్ లేకుండా రాష్ట్రం ఊహించకలుగుతామా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. నాలుగు వేల పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ కి.. వేయకుంటే బీఆర్ఎస్ కి ఓటు వేయండని కోరారు.
180 మంది రైతులు, ఆటో కార్మికులు చనిపోతే కనీసం కాంగ్రెసోళ్లు ఒక్కరు కూడా పరామర్శించలేదు. వడగళ్ల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు 25వేల రూపాయలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ.. మీ ఇంట్లో ఇన్ని రోజులు కుటుంబ సభ్యులుగా పనిచేశా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 22 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాను. భారత దేశంలో ఏ కలెక్టర్ కు దక్కని అవకాశం 5 సంవత్సర కాలంలో కలెక్టర్ గా చేసినందుకు నాకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ కడవెరుగు మంజుల, నాయకులు రాజనర్సు, కొండం సంపత్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయి రాం, మారెడ్డి రవీందర్ రెడ్డి, దీప్తి నాగరాజు, వంగ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.