ప్రతిపక్షం, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో దాదాపు 30పూరి గుడిసెలు దగ్ధమైన విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని బిజెపి శ్రేణులతో కలిసి దగ్ధమైన పూరి గుడిసెల ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆదర్శ్ నగర్ లో అగ్ని ప్రమాదంలోదగ్ధమైన పూరి గుడిసెల ప్రాంతాన్ని బిజెపి శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరి గుడిసెలు ఉన్న ప్రాంతం భూ వివాదం లో ఉందని, అలాంటప్పుడు గుడిసెలకు కిరాయి ఎవరు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే వివాదాస్పద స్థలానికి కరెంటు , నీళ్లు ఏ విధంగా సరఫరా అవుతున్నాయన్నారు. వీటికి అనుమతులు ఇచ్చారా..? లేక ఇల్లీగల్ గా వాడుతున్నారా అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద స్థలంలో నివసిస్తున్న నిరుపేదలు మేడారం జాతరకు వెళ్లిన సమయం చూసి భూ కబ్జాదారులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ విషయంలో నిజాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం పోలీస్ యంత్రాంగం పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, ఎర్రం మహేష్, కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, దుర్శెట్టి అనూప్, పెద్దపల్లి జితేందర్ రాపర్తి ప్రసాద్, బండ రమణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, కటకం లోకేష్, అనిల్, ప్రసన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.