కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 8: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండలంలోని ఇంద్రపాల నగరం ఎంపీటీసీగా ఉన్న పూస బాలమణి మండల పరిషత్తు అధ్యక్షురాలిగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల పరిషత్తు కార్యాలయంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి సమక్షంలో వీరి ఎంపిక జరిగింది. ఎంపీపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు, సీపీఎం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీ లకు బాలమణి కృతజ్ఞతలు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్పగుచ్చం అందించి నూతన ఎంపీపీ బాలమణికి శుభాకాంక్షలు తెలిపారు.
గత ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి పై కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు ప్రకటించిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 30న సమావేశం జరగవలసి ఉంది. అయితే అవిశ్వాస తీర్మానానికి రెండు రోజుల ముందే తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో రామన్నపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీని నిర్వహించి ఓ ఫంక్షన్ హాల్ లో అభినందన సభ కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు.