ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మంత్రాలయం- మటుమర్రి రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ – మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని (20) కర్నూలులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది ఉండటంతో రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు(22) ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నారు. అయితే చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలయం మటుమర్రి రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న టీబీ వంతెన వద్ద రైలు కిందపడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.