ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం గుండెపోటుతో చికిత్స పొందుతూ ఏఐజి ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తమ సహచర ఐపీఎస్ అధికారి ఆకస్మికంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరణించడంతో పలువురు ఐపీఎస్ అధికారులు ఆసుపత్రికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర డిజిపి రవి గుప్తా, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి .శివధర్ రెడ్డి, రైల్వేలు రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, తరుణ్ జోషి తదితరులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు..
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియ నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఐజి ఆస్పత్రిలో ఉన్న ఆయన భౌతికయాన్ని బుధవారం ఉదయం ఆయన స్వగృహానికి తీసుకువెళ్తారు. మధ్యాహ్నం షేక్ పేట ప్రాంతంలోని మహాప్రస్థానానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరుపుతారు.
ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు..
1991 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రాజీవ్ రతన్ కరీంనగర్ జిల్లా ఎస్పీగాను, హైదరాబాద్ రీజియన్ ఐజిగాను, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గాను, రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ గాను, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గాను పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. వచ్చే అక్టోబర్ నెలలో ఆయన ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు.