నిర్మల్‌లో ముస్లిం మత గురువుకు ఈద్ ముబారక్ చెప్పిన వేద పండితుడు ధనుంజయ్
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్, 13 : మతం కంటే మానవత్వమే గొప్పదని నిర్మల్ లోని ఇరు మతాల మత గురువులు చాటారు. పట్టణంలోని నగరేశ్వర వాడ లో గల చారిత్రాత్మక నాగశేశ్వర స్వామి వారి ఆలయ పూజారి ధనుంజయ, ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకొని పంజేష గల్లి వీధిలోని చారిత్రాత్మక మస్జిద్ ఏ సలీం ఇమామో ఖతీబ్ నిర్మల్ ఉప ఖాజీ మౌలానా మహమ్మద్ అబ్దుల్ అలీం ఖాస్మీను వ్యక్తిగతంగా అయిన నివాసానికి వెళ్లి ఈద్-ఉల్-ఫితర్ ముబారక్ చెప్పడం జరిగింది. పూజారి ధనుంజయ్ రాకను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో మౌలానా అబ్దుల్ అలీం ఖాస్మి వారి కుటుంబం స్వీకరించి ఆయనకు పండగ సాంప్రదాయ పద్ధతులలో స్వాగతం పలికి షిర్ ఖుర్మాను అందజేశారు.
ఆయనతో పాటు వచ్చిన మిత్రునికి కూడా పండగ సాంప్రదాయ పద్ధతులలో స్వాగతం పలికి ఈద్ ముబారక్ చెప్పడమే కాకుండా ఈద్ దావత్ లో తగిన విధంగా గౌరవించారు. మౌలానా మహమ్మద్అబ్దుల్ అలీం ఖాస్మి, పూజారి ధనుంజయ్ లు సుమారు అరగంట పాటు పవిత్ర రంజాన్ మాసం కఠోర ఉపవాస దీక్షలు తదితర విషయాలపై ప్రముఖ గ్రంథాల ఆధారంగా ఉన్న వాస్తవ విషయాలపై చర్చించుకున్నారు. మతం కంటే మానవత్వమే గొప్పదని ఈద్ ముబారక్ చెబుతూ.. ఈ సందర్భంగా ఇరువురు ఆలింగనం చేసుకొని ఫోటోలకు అవకాశం కల్పించారు. ఏ గ్రంథంలోనైనా ఏ మతంలోనైనా పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సాధించినట్లయితే అందులో ప్రథమంగా మానవత విలువలకే ఉన్నత స్థానం ఉందన్న విషయాన్ని నవ సమాజం గుర్తించాలని వారు ఈ సందర్భంగా హితబోధలు చేశారు.