Trending Now

‘ప్రజలను వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా..?’..

కాంగ్రెస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఫైర్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రజలను వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసింది. కేసీఆర్ మాటలు కోటలు దాటేవి.. కానీ పనులు ఫాంహౌస్ దాటేవి కాదు. రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బందిపెట్టారు. అందుకే, రైతులను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అనేక రకాలుగా 400 పైగా హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని ఆయన ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీరుస్తామని, అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించి.. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారన్నారు. వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి వంటివారు అనేక ప్రాంతాల్లో చెప్పారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ గ్యారంటీ అంటే… ప్రజలను మభ్యపెట్టే, మోసం చేసే గ్యారంటీ. రైతులకు వెన్నుపోటు పొడిచే, దగా చేసే గ్యారంటీ.. సోనియమ్మ పాలన రాగానే డిసెంబరు 9న తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, కొత్తగా రుణాలు తీసుకోండని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మాటలను నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే రైతులను మోసం చేశారు. నేడు రైతులకు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతులు దళారీల దగ్గర మిత్తీలకు అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదు. వారికి వసూళ్లకు పాల్పడి ఆ పైసలను ఢిల్లీకి పంపడం పైనే శ్రద్ధ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో రేవంత్ రెడ్డి స్ఫష్టం చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో తెలంగాణ రైతులను మోసం చేయడమే వారి ఉద్దేశమని.. రైతులకు ఆర్థిక సాయం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పేరుతో దళితులను, గిరిజన బంధు పేరుతో గిరిజనులను మాయమాటలతో వెన్నుపోటు పొడిచారు. ఏ వర్గానికి ఎలాంటి బంధు ఇవ్వలేదు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ఉంది. రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోయి.. మరొక కుటుంబ పాలన వచ్చింది.. ఒక వసూలు రాజ్యం పోయి.. మరొక వసూలు రాజ్యం వచ్చింది. రాష్ట్రంలో మార్పు వస్తుందన్నారు.. ఒక మార్పు అయితే జరిగింది. కేసీఆర్ కుటుంబ పాలన పోయి.. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు గరిష్టంగా రూ. 1400 మద్దతు ధర మాత్రమే ఉండేది. నరేంద్ర మోదీ పాలనలో రూ. 2200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 26 వేల కోట్ల ఖర్చుతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ప్రతి బస్తాకు ఇచ్చే సుతిల్, కూలీ, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు, రైస్ మిల్లులకు చార్జీలు.. రైతు కల్లాల నుంచి మొదలు ధాన్యం ఎఫ్ సీఐ గోదాంలకు చేరే వరకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలులో అండగా ఉంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 2,200 బోనస్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వమిచ్చే బోనస్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ తో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంతో రైతులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేని నవ భారతాన్ని నిర్మించారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పారిశ్రామిక రంగంతో పాటు అనేక రకాలుగా విద్యుత్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని స్ఫష్టంచేశారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, చెప్పులు బారులు తీరిన క్యూలైన్లు కనపడేవి. అనేకసార్లు లాఠీచార్జ్ లు జరిగాయి. రైతులు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. మోదీ గ్యారంటీ అంటే.. ఇచ్చిన హమీని అమలు చేసే గ్యారంటీని స్పష్టంచేశారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. రాహుల్ గాంధీ తన జీవితంలో ప్రధానమంత్రి కాలేరు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితి లేదు. అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అండగా ఉండేలా బీజేపీ నిరసన దీక్షను చేపట్టింది. నేడు రైతు దీక్ష చేపట్టాం. రైతులకు అండగా బీజేపీ ఉంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు.

Spread the love

Related News