పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఒక్క హామీ నెరవేర్చలేదు..
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి..
ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 15: మళ్లీ బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పినట్లు ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజల కొరకు ప్రభుత్వంగా ఉండాలని చెప్తే, నేడు ప్రజల చేత డబ్బుల కొరకు ఎన్నికలు అవుతున్నాయని ఎన్నికలంటే డబ్బు, ఎన్నికలంటే పెట్టుబడి లాగా మారాయని అన్నారు. నేడు వామపక్షాలు బలహీనపడ్డాయి వాస్తవం అని దీనికి కారణం అవకాశవాద రాజకీయమని చాడ అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పది ఏళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నెరవేర్చలేక నిరుద్యోగులను మోడీ మోసం చేశారన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని అన్న మోడీ ప్రభుత్వం, ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదని విమర్శించారు.
మరొక్కసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగితే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి, ఏకపక్ష పాలన విధంగా చేసేటట్టు కొనసాగిస్తారని ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రశ్నార్థకమని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ప్రశ్నించే తత్వం, ప్రజాస్వామ్య హక్కులు ఉండవని అన్నారు. అందుకే వామపక్షాలు ఇండియా కూటమిలో జతకట్టి దేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా మద్దతిస్తున్నామన్నారు. తెలంగాణలో గత మునుగోడు ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ కు మద్దతిస్తే గెలిచి, ఆ తరువాత వామపక్షాలకు వెన్నుపోటు పొడిచారని అహంకార, అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ పతనమైందన్నారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగిస్తామని చెప్పి మోసం చేశారని, తదనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని బీఆర్ఎస్ పార్టీ చవి చూసిందని అన్నారు. అందుకనే వామపక్షాలను మోసం చేసిన వారు ఎవరు బాగుపడరని అన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఒక్క సీటు తీసుకోని గెలిచి, కాంగ్రెస్ పార్టీకి 118 సీట్లు లో మద్దతిచ్చి గెలిపించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, వరంగల్ కు రైల్వే కోచ్ తేలేదని బయ్యారంకు ఉక్కు ఫ్యాక్టరీ తేలేదని అన్నారు. ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ఓట్ల అడుగుతుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, సీపీఐ కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, సీపీఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, కాల్వల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.