జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్
ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 16 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పులతో ‘రాజ్యాంగ పరిరక్షణ చైతన్య’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ.. పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు. గత పది సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో బీజేపీ నిరంకుశ విధానాలను అభలంబిస్తుందని.. మత ప్రాతిపదికన రాచరిక పాలన కొనసాగించుటకు రాష్ట్రాలపై పెత్తనం చలాయించుటకు అనేక కుట్రలు చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే రాముడి బొమ్మలు పెట్టుకొని ప్రజలను సెంటిమెంటును రెచ్చగొట్టి, ఓట్లు అడిగే స్థితికి బీజేపీ దిగజారిన వైఖరిని నిరసించాలని కోరారు. రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని 750 మంది రైతులను బీజేపీ ప్రభుత్వం చంపిందన్నారు. బడా సంపన్నను విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగంలో స్వామినాథం కమిటీ రిపోర్టు అమలు ఏమైనదని ప్రశ్నించారు. ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో వచ్చిన దొంగ విరాళాలు బీజేపీ అవినీతికి పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ లాంటి రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాల నేతలపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలపై జోక్యం చేసుకొవడం రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులు కావాలని రాజ్యాగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, ధ్యాగల సారయ్య, కొయ్యడ కొమరయ్య, ప్రొఫెసర్ వీరన్న నాయక్, చిట్యాల ప్రకాష్, సీపీఐ నాయకుడు గడిపే మల్లేష్, కాంగ్రెస్ నాయకులు బంక చందు, వెన్నరాజు, జన జాగృతి నాయకుడు ముఖ్యర సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.