నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల నుండి ప్రారంభమైన భవ్య శ్రీరాముని భారీ శోభాయాత్ర అత్యంత భక్తి ప్రాపత్తుల మధ్య శ్రీరామ నామస్మరణతో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, బీజేపీ ఎంపీ అదిలాబాద్ అభ్యర్థి గోడెం నగేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి కాషాయా జండా ఊపి శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరం నిర్మాణంతో ఇవాళ దేశమంతా ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ సందర్భంలో ఆ శ్రీరాముడు పుట్టినరోజు అయిన శ్రీరామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ గ్రామ గ్రామాన, వాడవాడల రామనామ స్మరణ చేస్తూ ప్రజలందరూ ఆనందంగా గడపాలని కోరారు. ధర్మ స్వరూపుడైన ఆ రామయ్య చల్లని చూపులు మన అందరిపై ప్రసరించాలని.. మళ్లీ ఆ రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ వాహిని కార్య కర్తలు, పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.