ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో ఉదయం 11:00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 6,23,092 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులు ఉండగా.. తాజా ఫలితాల్లో 86.69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6.18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. బాలురు 84.32, బాలికలది 89.17 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. టెన్త్ ఫలితాలు బాలికలే పై చేయి సాధించారు. ప్రతియేటా మాదిరిగానే ఈసారి కూడా ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతంతో బాలికలు సత్తా చాటారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలు జరిగిన 22 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ప్రకటించడం విశేషం.