ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 23 : అదిలాబాద్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, సీనియర్ నాయకులు యునిస్ అక్బానీలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. లోకసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదిలాబాద్ కలెక్టర్ రాజన్ష షా ఆత్రం సక్కు నామినేషన్ ను స్వీకరించి పున: పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అన్ని వర్గాలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామ పరిధిలోగల లక్ష్మీపూర్‌కు చెందిన ఆత్రం సక్కు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి చేతిలో ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.