ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL 2024 లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 8 మ్యాచ్‌లో 4 గెలుపుతో గుజరాత్ 6వ ప్లేస్‌లో ఉండగా.. 3 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 8వ స్థానంలో ఉంది. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్లు కెప్టెన్లు గిల్, పంత్ భావిస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ టీమ్‌లు 4 సార్లు తలపడగా.. చెరో రెండు సార్లు గెలిచాయి.
గత మ్యాచ్‌లో సొంతగడ్డపై హైదరాబాద్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సమాయాత్తమవుతోంది. తాజా సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలిపోరులో పరాజయం పాలైన గుజరాత్.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగా ఉండాలంటే ఇరు జట్లకు విజయం తప్పనిసరి కాగా.. బ్యాటింగ్‌లో గుజరాత్‌తో పోలిస్తే ఢిల్లీ కాస్త పైచేయిలో ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. మార్ష్ స్థానంలో వచ్చిన జేమ్స్ మెక్ గుర్క్ రెండు హాఫ్ సెంచరీలతో మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ కుదురుకోవాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు ఆకట్టుకుంటుండంగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ ప్రభావం చూపుతున్నారు.
మరోవైపు గుజరాత్ బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపుల్లేవు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 7 వికెట్లు కోల్పోవడం ఆ జట్టు బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో తెలుపుతోంది. ఓపెనర్ సాహా పూర్తిగా విఫలమవుతుండగా.. కెప్టెన్ గిల్ ఫామ్ లేమితో సతమవుతున్నాడు. సాయి సుదర్శన్ రాణించాల్సిన అవసరముండగా.. మిల్లర్ విఫలమవుతుండటంతో విలియమ్స్ జట్టులోకి వచ్చే అవకాశముంది. తెవాటియా ఆడుతున్నప్పటికి అతడికి సరైన సహకారం లేదు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.