హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నారు. వంద రోజుల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పథకాలు అమలు చేసేందుకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.
ఇందులో భాగంగా గురువారం సచివాలయం లో కేబినెట్ సబ్ కమిటీతో సీఏం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గృహజ్యోతి, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. వంద రోజుల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేసేలా రూట్ మ్యాప్‌ను రేవంత్ సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ఛాన్స్ ఇతర పార్టీలకు ఇవ్వొద్దని భావిస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న రెండు గ్యారంటీలకు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు గ్యారంటీలను రెండు, మూడు రోజుల్లో అమలుచేయాలని అందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సమావేశంలో రేవంత్ అధకారులను ఆదేశించారు.