ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 26: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటోషోడు స్థాపించారని చెప్పారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బ్రిటీష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నరని.. పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ. ఈ దేశ ముద్దు బిడ్డలు వాజ్ పేయి, అద్వానీ స్థాపించిన పార్టీ బీజేపీ. మరి కాంగ్రెస్ లో భారతీయత ఎక్కడుంది?’’అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ను ఏలుతున్న గాంధీ కుటుంబం డూప్ అని.. మహాత్మాగాంధీ అసలు సిసలైన గాంధీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే.. పేదలు సహా ఎవరు చనిపోయినా.. వారి ఆస్తిలో 55 శాతం కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తోందని హెచ్చరించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఇంఛార్జీ శ్యాం పిట్రోడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. మోదీ హయాంలోనే దేశానికి, ధర్మానికి రక్ష అని చెప్పిన బండి సంజయ్.. ఈ దేశంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయంటే.. దేశం సురక్షితంగా ఉందంటే అది మోదీ చలువేనని ఏ జవాన్ ను అడిగినా చెబుతారని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానుకొండూరులో నిర్వహించిన ‘దళిత సమ్మేళనం’కు బండి సంజయ్ తోపాటు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర నాయకులు సురేష్, శ్రీనివాస్, సొల్లు అజయ్ వర్మ , సోమిడి వేణు ప్రసాద్, రాపాక ప్రవీణ్ లతోపాటు బీజేపీ నాయకులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దళిత సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడారు. 57 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ ఏనాడూ దళితుల అభ్యున్నతికి పని చేయలేదు. అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్. పార్లమెంట్ లో దళితుల హక్కులపై మాట్లాడుతున్న అంబేద్కర్ ను అడ్డుకున్న వ్యక్తి జవహార్ లాల్ నెహ్రూ.. రాజీనామా చేసి బయటకు వచ్చి పోటీ చేస్తే అనేక కుట్రలు చేసి అంబేద్కర్ ను ఓడించి దారుణంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. అంబేద్కర్ మరణిస్తే ఆయన పార్ధీవదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబయి తరలించి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని.. ఎన్నికలప్పుడే తప్ప ఏనాడూ దళితులను పట్టించుకోని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ అని బండి సంజయ్ మండిపడ్డారు.