Trending Now

ఐదేళ్లు అవకాశం ఇవ్వండి..

కరీంనగర్‌కు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తెస్తా..

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 27: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్‌కు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌తో పాటు ట్రిబుల్ ఐటీ, నవోదయ పాఠశాలలు తెచ్చి విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతానని.. ప్రజలు ఐదేళ్లు అవకాశం కల్పిస్తే పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతునవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ కు ₹వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వేలైన్ తీసుకువచ్చానని, మానేరు నదిపై తీగల వంతెన నిర్మాణం, మానేరు రివర్ ప్రంట్, ఐటీ టవర్, శాతవాహన యూనివర్సిటీ దగ్గర నైట్ లైట్ నిర్మాణం చేయడం జరిగిందని పేర్కొన్నారు.

టీటీడీ నుంచి ₹25 కోట్ల నిధులు తెచ్చి పది ఎకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని.. ఒక్క గుడి తేలేదు.. ఒక్క బడి తేలేదని పేర్కొన్నారు. ఐదేళ్లలో కనీసం బండి సంజయ్ నవోదయ పాఠశాల కూడా తీసుకురాలేకపోయాడని.. బండి సంజయ్ కి పదవి మీద ధ్యాస ఉంది కాని.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో లేదన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గారడీ మాటలు.. అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని.. కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఆగమైపోయారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్. మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కేడీసీసీ బీ వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News