Trending Now

పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఈ సందర్బంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమయ పాలన పాటిస్తూ.. షిప్టుల వారిగా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు, పోలింగ్ కేంద్రాలకు సంబందించిన వివరాలు, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గాజులపేట్ పంచశీల్ కళాశాల లోని పోలింగ్ కేంద్రాన్నిసందర్శించారు. పోలింగ్ కేంద్రంలో గల ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యాలను ఆయన పరిశీలించారు. వికలాంగ ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ర్యాంప్ సౌకర్యం ఉండాలని సూచించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిళ, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనంతరం భైంసా పట్టణంలోని శిశుమందిర్ లో గల పోలింగ్ కేంద్రం 151 ను పరిశీలించి అధికారులకు సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఏఏస్పీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం ముధోల్ లో గల ఈవీఎం స్ట్రాంగ్ రూం ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ జానకి షర్మిల తో కలిసి సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ పరిశీలించారు. రిజిస్టర్‌లో ఆయన సంతకం చేసారు. ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు, విధులు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఆర్డీవో కోమల్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News