ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్, మే 1: గత రెండు నెలలుగా అప్పుడా.. ఇప్పుడా అంటూ ఎదురుచూస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక కథ బుధవారంతో ముగిసింది. ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంద్రకరణ్ రెడ్డి గత శాసనసభ ఎన్నికలలో నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఓటమిపాలయ్యారు. గత రెండు నెలలుగా ఆయన కాంగ్రెస్లో చేరికను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో అధిష్టానం అయిన చేరికను వాయిదావేస్తూ వచ్చింది. బుధవారం సాయంత్రం ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా సమర్పించారు. ఆ వెంటనే నేరుగా గాంధీభవన్ కి వెళ్లి ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాసు మున్షీ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.