కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
ప్రతిపక్షం, హనుమకొండ ప్రతినిధి, మే 04: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య దూసుకు పోతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి కాజీపేట, రెహ్మాత్ నగర్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిశారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని కోరారు. అనంతరం మార్కెట్ లో వ్యాపారులతో కలిసి క్రయ విక్రయాలు నిర్వహించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ 62, 63 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వమన్నారు. 3 నెలలు కాకముందే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మహిళలకు 500కే గ్యాస్ కలెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించామని తెలిపారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.