ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గజ్వేల్‌లో నీలం మధు కు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇద్దామని గజ్వేల్ లో కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గజ్వెల్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన రోడ్ షో లో జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గజ్వెల్ పట్టణంలోని ముఖ్య వీధులతో పాటు ప్రధాన రహదారి, మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీల మీదుగా దాదాపు రెండు గంటలకు పైగా రోడ్ షో కొనసాగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు 25వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి.
మెజారిటీ ఇస్తే నేను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి గజ్వేల్ ప్రజలకు అన్ని పనులు చేయిస్తా. మల్లన్న సాగర్ నిర్వాసితులకు రావాల్సిన పరిహారాలు ఇప్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వేదిక మీద వున్న నేతల సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికైనా గజ్వెల్ ప్రజలు కళ్లు తెరవండి. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ కు మెజారిటీ ఇవ్వండి. కలెక్టర్, ఎస్పీ మొదలు ఇతర అధికారులు మీరు చెప్పినట్లే పని చేస్తారు. అధికారులతో కలిసి గతంలో వాళ్లు ఆడుకున్నారు.. ఇప్పుడు మనం ఆడుకుందాం. ఏ పోలీస్ కూడా కాంగ్రెస్ కార్యకర్తల వెంట్రుక కూడా టచ్ చేయలేరు. ఏదైనా జరిగితే నేనే స్వయంగా వస్తా అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.