ప్రతిపక్షం, సిద్దిపేట, మే 10: సిద్ధిపేటకు వచ్చే ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి ఆశీస్సులతో సిద్ధిపేటకు వస్తారాన్నారు మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.బసవేశ్వర జయంతి సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల వద్ద బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒకడనీ, ఇతడిని బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారన్నారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అని ఆయన లింగాయత ధర్మం స్థాపించారన్నారు.
బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కుల రహిత సమాజం కోసం కృషి చేశారని, చెప్పడంతో పాటు ఆచరణలో అమలు చేసిన వ్యక్తి అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలని, కష్టపడి పని చేసిన వారే జీవితంలో పెకొస్తారని చెప్పిన ఆయన సూక్తులను స్ఫూర్తిగా తీసుకుని పని చేద్దాం అని సూచించారు. హైదరాబాదు ట్యాంకు బండ్ మీద ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి బసవేశ్వరుడి విగ్రహ ఏర్పాటు చేయించారనీ గుర్తు చేశారు. నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించారన్నారు. అన్ని రకాలుగా సమాజ గౌరవం నిలబెట్టడానికి బసవేశ్వరుడి మార్గంలో పయనించి అందరూ పాటు పడాలని కోరారు. కుల, మతాలు ఏవైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మన భారత దేశమని, అందరూ కలిసి మెలసి ఉండాలన్న బసవేశ్వరుడి సూక్తులు ఆచరణలో పాటిద్దామన్నారు. సిద్దిపేట లో బసవేశ్వర భవన్ ఏర్పాటు కు నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.