ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 10: నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు డీవైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి డి. తిరుపతి తెలిపారు. డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్ల కాలం నుంచి యువతను, ప్రజలను మోసం చేసి బీజేపీ పబ్బం గడుపుకుందని, మరోసారి గెలవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుందని దాన్ని యువత తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తుందని, ప్రజల మధ్య అసమానతలను పెంచి పోషిస్తుందని సనాతన ధర్మం పేరుతో వెనకటి కాలానికి తీసుకెళ్లేందుకోసమే బీజేపీ ప్రయత్నం చేస్తుందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళుతున్న దేశాన్నిమూఢనమ్మకాల పేరుతో వెనక్కి నెట్టే ప్రయత్నం చేసిందని, యువతకు ఉద్యోగాలు లేకుండా రిజర్వేషన్లను అమలు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందని విమర్శించారు.
గతంలో ఎన్నడు లేని విధంగా ధరల భారం మోపి ప్రజల నడ్డి విరిసిందని, బీజేపీని ఓడిస్తేనే ప్రజలు బారాల నుంచి విముక్తి పొందుతారని, యువతకు ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రాజ్యాంగాన్ని రక్షించాలని తిరుపతి పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి ని కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, జిల్లా నాయకులు యువన్, శివాని , ఊర్మిళ, శైలజ, యేసు, మురళీ లు పాల్గొన్నారు.