ప్రతిపక్షం, నేషనల్: లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) కన్నుమూశారు. గురువారం రాత్రి జోషి గుండె పోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆరోగ్యం విషమించడంతో ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. లోక్ సభ స్పీకర్‌గా తనదైన ముద్ర వేసుకున్న మనోహర్ జోషి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాల్ థాకరే స్థాపించిన శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారులో 1999 నుంచి 2002 వరకూ భారీ పరిశ్రమల మంత్రిగాను పని చేశారు. అనంతరం 2002 నుంచి 2004 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేశారు. స్పీకర్‌గా అన్ని పార్టీల నేతల కలగొల్పుగా ఉండి వివాదరహితుడిగా పేరు తెచ్చకున్నారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ సభ్యుడిగా మనోహర్ జోషి కొనసాగారు.